
#ఉపయోగంలేనితెలివితేటలు #telugumoralstories #bedtimestories
ఉపయోగంలేని తెలివితేటలు
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు దగ్గరలో వున్న అడవికి వెళ్ళి .. చెట్లనుకొట్టి.. దాన్ని కలపగా మార్చి.. అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వుండేవారు. అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టను కొడుతూ వుండగా..
" కొట్టొద్దు.. నన్నేం చేయెద్దు.. నన్ను విడిచిపెట్టండి.. " అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి.
చెట్టు మాట్లాడటంతో వాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు చెట్టు మాట్లాడటమేమిటీ.. ఇలాంటి వింతను ఇంతకు ముందెన్నడూ చూడలేదే.. అనుకుంటూ చర్చించుకోసాగారు.
“ మిత్రులారా.. నేను చాలా మహిమ గల చెట్టును.. నన్ను ఈ అడవిలో వున్న జీవరాశులన్నీ దైవంగా కొలుస్తుంటాయి.. అలాంటి ప్రత్యేకతలు వున్న నన్ను మీ గొడ్డలికి బలి ఇవ్వవద్దు... " అంది.
“ నీవు చెప్పేది అంతా బాగానే వుంది.. మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి?” అన్నాడు మొదటివాడు.
వెంటనే వాళ్ల ముందు రకరకాల తిండి పదార్దాలు ప్రత్యక్షం అయ్యాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేసారు వాళ్ళు.
తర్వాత రెండోవాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు.
"మా కోరక తీర్చుకోవడానికి మేం ప్రతీసారీ ఇక్కడికి రావాలంటే కష్టం కాదా.. మాకే ఆ శక్తులేవో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం.. "
“ సరే అయితే, నేను మీకు కొన్ని దివ్యశక్తులు ప్రసాదిస్తాను.. వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు.. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గానీ , చెడు పనులకు గానీ వాడకూడదు.. “ అంది చెట్టు..
వారు దానికి అంగీకరించారు. వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి. దాంతో వాళ్ళు రోజూ చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటి బాట పట్టారు.
అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది. అది చూపులేక అవస్ద పడటం చూసి జాలి కలిగింది.. ఆ వృక్ష దేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించిన్నట్టుగా కూడా వుంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు.. అంతే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు..
అలా అడవి దారిలో వెళ్తున్న వారు ఒక చచ్చిన సింహాన్ని చూచారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. కానీ ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు..
"ఇది కౄర జంతువు దీన్ని బతికిస్తే ఇది మనలను చంపుతుందేమో.."
"మనము దీన్ని బతికించాం కాబట్టి మనలను ఏమి చేయదు.. పైగా మెచ్చుకుంటుంది.." అని రెండవ వాడు సర్దిచెప్పాడు.
ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోసారు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ వారిద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది.
ఈ కథలో నీతి ఏమిటంటే.. " అలోచనలేని తెలివి అనర్థాలకు దారి తీస్తుంది..."
0 Comments